Wednesday 9 January 2008

అల్లో అల్లో అల్లో అందరికి నమస్కారమండి

అసలు ఈ సదరు blog ఎందుకు అని మాత్రం నన్నడక్కండి…ఏదో నా బుర్రకు తోచిన కుర్రాలోచనలని మీ అందరికి వినిపిద్దామని ఒక చిలిపి కోరిక…అంతేనండోయ్..మీరు ఆ మాత్రం దానికి నీ blog మాత్రమే ఎందుకు చూడాలి అని మాత్రం అడక్కండి…ఎందుకంటే దానికి సమాధానం నాక్కూడా తెలీదు కాబట్టి…ప్రస్తుతానికి నాకు ఈ blog ని ఎలా హడావుడిగా ఉంచాలా అనే ఆలోచన నా బుర్ర తొలిచేస్తోంది…అందుకే నా దగ్గర ఉన్న తెలుగు సినిమా పాటల
lyrics (మంచి మంచి పాటలే పెట్టుకున్నాలెండి) మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను…వాటిలోని అందాన్ని ఆస్వాదించ ప్రయత్నిద్దాం…ఏమంటారు???ప్రస్తుతానికి ఏమన్నా అంటానికి కూడా ఎవరూ లేరు కదా!!!సరే మరి మొదటి పాటగా ఏ పాట పెడదాం???
నేను తెలుగు సినీ కవులలో బాగా ఇష్టపడేది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని..వారిని నా గురువుగా భావిస్తాను కూడా….ఎందుకంటే నేను పుట్టిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు విన్న పాటల్లో(కనీసం కొత్త పాటల్లో) ఆయన రాసినవే ఎక్కువ వినటం అవ్వనీయండి లేక ఎక్కువ ప్రభావం చూపినవి అవ్వనీయండి ఆయన రచనలే…ఎంత సరళంగా,వినసొంపుగా ఉంటాయో మాటల్లో చెప్పటం కష్టం…
ఆయన్ని ఆరాధించడానికి ఇంకొక కారణం ఏమిటంటే పూర్వం సంగీత దర్శకులు కవులు పాట రాసాక దానికి రాగం కట్టేవారు..కాని గొప్ప సంగీత దర్శకులైనప్పటికీ “ఇళయరాజా” గారి తరం నుంచే సంగీతం ఇచ్చాక పాట రాసే ప్రక్రియ ఆరంభమయ్యింది…మీరు ఏ సినీ కవిని అడిగినా,కొంచెం సంగీత ఙానం ఉన్న వారినెవరినడిగినా ముందు రచన,తరువాత రాగం కట్టడమే సరైన పద్ధతి అంటారు…కారణాలు
1)కవికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చి భావవ్యక్తీకరణ చేసే అవకాశాన్ని కలిగిస్తే పాట అత్యద్భుతంగా వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే
2)రాగం ఇచ్చాక రచన చేస్తే ఆ రాగంలో పదాలను ఇరికించినట్టుంటుందే తప్ప సంతృప్తికరంగా ఉండదు…ఇది కేవలం నా భావన కాదనేది గమనించ ప్రార్థన.

కాబట్టి సంగీతం ఇచ్చాక పాటలను రాయటం అనే ప్రక్రియ లో ఆద్యుడు శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు…సిరివెన్నెల గారు ఆయన్ను తన గురువుగా భావిస్తారు…గురువుకి గురువు కాబట్టి నాకు పూజ్యుడే…అదే కాకుండా ఆయన పాటలు విన్నాక కూడా మీరు ఆయన గొప్పతనాన్ని కాదనలేరు….కాబట్టి పైన చెప్పుకున్న ప్రక్రియ లో అత్యద్భుతంగా విజయం సాధించిన వారెవరని అడిగితే నేను తడుముకోకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారని చెప్పగలను…..

అదేంటి విజయాన్ని నువ్వెలా నిర్వచించగలవ్???
పాటను ఎలా రచించాలి?????
1)సందర్భానుసారంగా రచించాలి….
2)సరళంగా “అందరికి అర్థమయ్యేట్టుగా” రచించాలి…
ఇవి కొంచెం పేరు మోసిన సినీ కవులెవరైనా చేస్తున్నారు కదా అని మీరు ప్రశ్నించచ్చు..అప్పుడు గురువుగారి ప్రజ్ఞ బయటికొస్తుంది…పైన చెప్పిన రెండు విషయాలు ఆయనకు కరతలామలకమే….అవి కాక పాటను “అందంగా”,”ప్రాసతో” నింపి,ఏ మాత్రం “అసభ్యత”(obscenity) లేకుండా రాయటం కత్తి మీద సాము కాదంటారా చెప్పండి…ఇక్కడ మనకి ఎదురొచ్చిన విషయం “అసభ్యత లేకుండా”….శృంగారానికి,అసభ్యతకు చాలా తేడా ఉంది…
మన సినీ నిర్మాతలకు,దర్శకులకు,తారలకు(చాలా వరకు) పాట అంటే సినిమా లో కావాల్సిన మసాలా దొరికే స్థలం…మాస్ ని ఆకట్టుకునే నృత్యాలు,బూతులు తప్ప మరొక దృష్టి లేదు…
గురువుగారు ఈ విషయంలో తన వేదనని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు…
శృంగారం అనేది కేవలం శరీరానికి,అవయావాలకు సంబంధించినది కాదు,రెండు మనసులకు సంబధించినది…కానీ దురదృష్టవశాత్తూ మన తెలుగు సినిమాలు కేవలం ఆ మొదట చెప్పిన విషయానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప అసలు విషయాన్ని గ్రహించట్లేదు….

ఇలా చెప్పుకుంటూపోతే గురువుగారి గురించి అది ఒక్క పోస్ట్ తో అయిపోయేది కాదు కాబట్టి మన మొదటి పాట విషయానికి వద్దాం….గురువుగారి మొదటి చిత్రం “సిరివెన్నెల” చిత్రం నుంచి “విధాత తలపున” అనే పాట(అందరికి సుపరిచితమే అని నా అభిప్రాయం) పోస్ట్ చేస్తున్నాను…దీనిలో అందాన్ని,సొబగులని మనం ఒకళ్లకొకళ్లం వివరించుకుందాం…ఈ పాటను నేను ఏ వెబ్‌సైట్ నుంచో కాపీ పేస్ట్ చెయ్యలేదు…పాట వింటూ రాశాను కాబట్టి తప్పు చేస్తే గీస్తే అది నేనే..కాబట్టి తెలియజేయవలసినదిగా నా మనవి…

ఒక చిన్న మాట:నేను ఇక్కడ పోస్ట్ చేసే అన్ని పాటలు పాట వింటూ నేను రాసుకున్నవే…ఏ వెబ్సైట్ నుంచో చూసి రాసినవి కావు..గమనించ ప్రార్థన

విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవన వేదం
ఓం…………….
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం ఓం……
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం…….
ఆ ఆ ఆ…..
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం…. ఈ గీతం..

విరించినై విరచించినది ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వర గతి జగతికి శ్రీకారము కాదా…
విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించినది ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించినది ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

నా ఉచ్ఛ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం…. ఈ గీతం..
ఈ సందర్భం లో ఈ పాట గురించి మిగిలిన వివరాలు కూడా ఎంతో అవసరం కదా!!
కె.వి.మహదేవన్ గారు గొప్ప సంగీత దర్శకుడు..నేను ఇంతకు ముందు చెప్పినట్టు కాకుండా ఆయన పట్టు పట్టి పాట రాశాకే రాగం కట్టేవారు..అలాంటి సంగీత దర్శకులుండటం నిజంగా ఒక గొప్ప వరం…ఈ పాటను పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల గారు తమ గళమాధుర్యంతో పావనం చేశారు…
ఈ సినిమా దర్శకుడు కె.విశ్వనాథ్ గారి గురించి సినీ ప్రేమికులకి చెప్పనవసరం లేదు…ఆయన ఒక్కొక్క చిత్రం ఒక ఆణిముత్యం…ఆస్కార్ వరకు వెళ్లిన తెలుగు చిత్రాలు ఆయనవే అని చెప్పటానికి నేను చాలా గర్విస్తున్నాను….ఆయన తీసుకున్న కథలోని గొప్పదనం వలనే వాటికి తగినట్టు సాహిత్యం రాశారు గురువుగారు,రాగం కట్టారు మహదేవన్ గారు….హాట్సాఫ్ టు విశ్వనాథ్ గారు

3 comments:

Tulasi Ram Reddy said...

good బాగా రాసావు... నువ్వు కూదా తెలుగులో బ్లాగ్ మొదలు పెట్టావన్నమాట...

సరదాగా నాదాన్ని ఒక లూక వెయి...
http://teluguwebchannel.blogspot.com
http://chitram-vichitram.blogspot.com

Sundeep said...

bagundi......mee blog informative ga vundi.......

but try to make it interesting......

meeru mention chesina paata vunadaniki link vunte petandi........

Unknown said...

wow super adurs nag...........

naaku cheppaledu?? but anyways.........

u rock.......... simply superb undi nee blog.