Thursday 28 February 2008

శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ....

వారానికొక పోస్ట్ చెయ్యకపోతే నా చేతులు ఊరుకోవట్లేదు...ఎందుకంటే గురువుగారి పాటలు ఎన్ని ఉన్నాయి...ఒకటా రెండా....అందులో నాకు తెలిసినవన్నీ ఇక్కడ చెప్పాలంటేనే చాలా కాలం పడుతుంది...సరే ఇదంతా మాకెందుకు...పాటేంటో చెప్పమంటారా???ఐతే వినండి...ఈ వారానికి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వం లో వచ్చిన స్వర్ణకమలం చిత్రం లో పాట....

ఈ చిత్రం లో "శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ" అనే పాట, "ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్లు" అనే పాట ఉన్నాయని మీ అందరికీ తెలిసిందే....ఇక ఈ పాటల వివరాలకొస్తే రెండూ గురువుగారు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే రాశారు...సినిమాలో భానుప్రియ తండ్రి నుంచి వారసత్వంగా నాట్యం నేర్చుకున్నప్పటికీ ఆమె ఆశలు,ఆశయాలు వేరే విధంగా ఉంటాయి..ఆమె ఎప్పుడూ కలల లోకం లో విహరిస్తూ ఉంటుంది...వారి పక్కింట్లోకి అద్దెకు దిగుతాడు వెంకటేష్....ఆమెలోని నాట్యగత్తెను ఆరాధిస్తాడు...ఆమెను కళాకారిణిగా చూడాలని తపిస్తాడు..కాని ఆమె మాత్రం ఇతని ఆలోచనలకు పూర్తిగా విరుద్ధం గా ఉంటుంది...ఇలాంటి వారిద్దరి అభిప్రాయాల సంఘర్షణే ఈ రెండు పాటల సారాంశం...సిరివెన్నెల గారు ఈ పాటలు రాసేటప్పుడు అందరిలాగే హీరో ఆలోచన సరైనది కాబట్టి అతని దృష్టికోణం నుంచి ఆలోచించి "శివపూజకు" పాటలో మొదటి కొన్ని వాక్యాలు రాశారట...
"శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా"

చాలా బాగా కుదిరినాయి ఈ వాక్యాలు అనుకున్నారట...కానీ అప్పుడే వచ్చింది అసలు సమస్య...ఈ పాటలో హీరోయిన్ కూడా ఉంటుంది...ఆమె తన వైపు నుంచి కూడా వాదన వినిపించాలి కదా...మరి ఆ వాదన కూడా రాయాల్సింది గురువుగారే...హీరో వాదన చాలా బలంగా వినిపించేశాం...ఎంత ఆలోచించినా హీరోయిన్ వాదన బలంగా రాయటం కుదరలేదట...రెండు రోజులు తలమునకలయ్యేట్టు ఆలోచించగా,చించగా అప్పుడు మిగతా వాక్యాలు కుదిరాయట....

"పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా"

ఇప్పుడు మనం గమనిస్తే ఇద్దరి వాదన సరైనదే అనిపిస్తుంది...
"నేను నాట్యం కోసమో మరే దాని కోసమో పరుగాపేస్తే నేను,నా మది కోరుకున్న మధుసీమలను ఎలా చేరుకోగలను....నాకవే ముఖ్యం" అన్న హీరోయిన్ వాదనను కూడా ఎంత సముచితంగా రాశారో గమనించండి...

ఇంకా రెండో చరణం విషయానికొస్తే

"పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయరవళి ఓంకారం కానీ"

ఆమె ఊహాలోకాన్ని పడమర పడగలతో పోల్చారు...అంటే అదీ అస్తమించిన సూర్యుడితో సమానం....అది ఒక పాము లాంటిది అన్నారు...అలాంటి పడమర పడగలపై మెరిసే తారలకై(పాము పడగ మీద మెరిసే రత్నాల లాగా) రాత్రిని వరించకు అనేది భావం ఇక్కడ...తూరుపు వేదిక మీద నర్తకిలా, ఈ భూమి మెచ్చుకునే కాంతులనివ్వు...నీలో వచ్చిన కదలిక చైతన్యానికి తొలిమెట్టు కానివ్వు...అందరినీ ఎదిరించిన ఆ గుండె చప్పుడే ఓంకారం అవ్వనివ్వు అనే భావం కూడా ఎంత అందంగా ఉందో గమనించండి

మరి ఈ వాదనకి హీరోయిన్ ఏమన్నది??


"తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా"

"నేను వేళ్లే సంకెళ్లై కదలలేని మొక్కలా ఉన్న చోటే ఉంటూ ఎప్పుడో ఆమని(వసంతం) వస్తుందని ఎదురు చూడను...భూమికి అన్ని వైపులా అంతులేని అందముంది...ఆ అందాన్ని చూసే ఆనందం అనే గాలి నన్ను నడిపిస్తోంది...దానితో పాటే నన్ను వెళ్లనివ్వు...
ప్రతి రోజూ ఎదో ఒక కొత్త గీతం స్వాగతించనీ నన్నిలా....వెన్నెల పాడే పాట నాకు తోడు ఉందిగా...." అని సమర్థించుకుంది హీరోయిన్...

ఇంకా చివరి వాక్యాలు అద్భుతం కదా!!!
"చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం
తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభన సువర్ణ కమలం"

నీ విలాసం నీ ఆడే పాదాల నుంచి పుట్టినదే...నీ సౌందర్య వికాసం(brightness) మెరిసే కిరణాలతో సమానంగా ఉంది...నీ అభినయ ఉషోదయం(నటన అనే ఉషోదయం) చూసిన ఆ సూర్యుడు ఆకాశం అనే సరస్సు లో వికసించిన వంద దళములు(రేకులు=petals) ఉన్న బంగారు కమలం లాగా అనిపిస్తాడు....


ఇద్దరి వాదనలు సమానంగా సరితూగినపుడే పాటకు అర్థం,అందం...అలా రాయగలగటం ఆ కవి ప్రజ్ఞ...
సంగీతం విషయానికొస్తే ఇళయరాజా తనకి శాస్త్రీయమైనా,western అయినా తిరుగులేదని నిరూపించుకున్నారు మరొకసారి.....బాలు,సుశీల పాటను ముగ్ధమనోహరంగా తమ తమ గొంతులతో తీర్చిదిద్దారు...ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసుకోవటంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు...
పాట ఇక్కడ వినండి...
http://www.chimatamusic.com/search.php?st=kamal&sa=Go%21
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా

పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా
పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయరవళి ఓంకారం కానీ
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా
పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం
తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం
తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభన సువర్ణ కమలం

పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా

4 comments:

Gopal Koduri said...

మామా.... గురువుగారి పాటల్లో ఒక పదార్థం ఎప్పుడూ embed చేసి ఉంటుందేమో కదా... ? అదే.. *వెన్ను చలి*! ఎన్నిసార్లు విన్నా దాని dose నాకు ఎప్పుడూ పడుతూనే ఉంటుంది.. నువ్వు ఒక్కో line కి భావార్థం చెప్తూంటే.. అది కాస్తా రెట్టింపైంది! gg మామ... :)

Anonymous said...

maama eppudu paatanu inta deep ga analysis cheyyaledu(assalu analysis e cheyyaledu) e post chadivaka naaku oka kotha angle chupinchavu...eppudu paata vinna edo vinadaaniki impuga undi kada ani vinevanni...gud

Anonymous said...

Great to see a IIITian blogging on Telugu songs... keep writing!

Nagarjuna said...

thank you sowmyaji!!!nenu raastoonE unTaanu...